![]() |
![]() |

సంగీతాన్ని ఆస్వాదించనివారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. సంగీతం అనేది మహా సముద్రం. వేల సంవత్సరాలు గడిచినా ఎప్పటికప్పుడు కొత్త సంగీతం పుడుతూనే ఉంటుంది. అలా ఎంతో మంది సంగీత దర్శకులు తమ మధురమైన సంగీతంతో శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ సంగీతం విషయానికి వస్తే.. భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులు ఆయా ప్రాంతాల ప్రజల అభిరుచి మేరకు స్వరాలను సమకూరుస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. అలా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లెక్కకు మించిన సంగీత దర్శకులు కొన్ని వేల పాటల్ని ఆవిష్కరించారు. వారిలో 1970వ దశకంలో చిత్ర పరిశ్రమకు వచ్చిన ఇళయరాజా తన సంగీతంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తన పాటలతో దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరిస్తున్నారు. ఎవరి సంగీతాన్నీ అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్న ఇళయరాజా.. ఎంతో మంది యువ సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. సంగీత ప్రియుల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిన ఇళయరాజా సినీ ప్రస్థానం గురించి, ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.
1943 జూన్ 2న తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురం గ్రామంలో.. రామస్వామి, చిన్న తాయమ్మాల్ దంపతులకు మూడో కుమారుడుగా జన్మించారు ఇళయరాజా. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. స్కూల్‌లో చేర్పించే సమయంలో ఆయన పేరును రాజయ్యగా మార్చారు రామస్వామి. చిన్నతనంలో పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీతం రాజయ్యకు బాగా వంటపట్టింది. ఆ తర్వాత సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినపుడు ఆయన పేరును రాజాగా మార్చారు. అతని సోదరుడు పావలార్ వరదరాజన్ కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీత కారుడుగా ఉండేవారు. రాజా, అతని సోదరుడు గంగైఅమరన్ ఆ బృందంలో చేరారు. పావలార్ బ్రదర్స్‌గా ఊరూరా తిరుగుతూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ఆ క్రమంలోనే భారతీరాజా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ బృందానికి పరిచయమయ్యారు. అప్పటికి బాలసుబ్రహ్మణ్యంకి సినిమాల్లో ఎక్కువ అవకాశాలు వచ్చేవి కావు. దాంతో కచ్చేరీలు చేస్తుండేవారు. పావలార్ బ్రదర్స్‌కి తన కచ్చేరీల్లో ఆర్కెస్ట్రా చేసే అవకాశం ఇచ్చారు బాలు. ఆ సమయంలోనే తనకు సినిమాల్లో చేరాలనే ఆసక్తి ఉందని బాలుకి చెప్పడంతో రాజాను ప్రముఖ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేష్ దగ్గర అసిస్టెంట్‌గా చేర్పించారు.
అలా రాజా జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. దాదాపు 200 సినిమాలకు వెంకటేష్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు రాజా. ఆ సమయంలో అతనిలోని టాలెంట్‌ని వెంకటేష్ బాగా ఉపయోగించుకున్నారు. ఆయన పేరుతో వచ్చిన చాలా పాటల్ని రాజా ట్యూన్ చేసేవారు. సినిమాలో జి.కె.వెంకటేష్ పేరే ఉండేది. రాజాలోని టాలెంట్‌ని గుర్తించిన రచయిత పంజు అరుణాచలం తను రచన చేస్తున్న ‘అన్నకిలి’ అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇప్పించారు. 1976లో విడుదలైన ఈ సినిమాకి దేవరాజ్, మోహన్ దర్శకులు. ఆ సమయంలో రాజాను ఇళయ అని పిలిచేవారు అరుణాచలం. ఇళయ అంటే చిన్నవాడు అని అర్థం. ఆ సినిమా నుంచి రాజా అనే పేరు కాస్తా ఇళయరాజాగా మారింది. తనకు తొలి అవకాశం ఇచ్చిన దేవరాజ్, మోహన్‌లకు ఆ తర్వాత వారు చేసిన సినిమాలన్నింటికీ సంగీత దర్శకుడుగా పనిచేశారు ఇళయరాజా. తమిళ్‌లో రూపొందిన భద్రకాళి చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ద్వారా ఇళయరాజా తెలుగులో పరిచయమయ్యారు. వయసు పిలిచింది, యుగంధర్, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక చిత్రాలకు ఇళయరాజా చేసిన అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.
ఆ సమయంలో చక్రవర్తి, కె.వి.మహదేవన్, రమేష్‌నాయుడు, సత్యం వంటివారు తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా ఉన్నారు. వారికి భిన్నమైన శైలిలో పాటలు చేయడం ద్వారా తెలుగులో కూడా బిజీ అయిపోయారు ఇళయరాజా. ఆ తర్వాత ఆయన చేసిన అభిలాష, ఛాలెంజ్, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, రుద్రవీణ, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, స్వర్ణకమలం చిత్రాల్లోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దాంతో తెలుగు, తమిళ్‌లో కూడా నెంబర్‌వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇండియాలో ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకులు ఉన్నప్పటికీ ఇళయరాజాకు ఉన్న ప్రత్యేకత వేరు. ఇసై జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఆయన్ని ఎవరితోనూ పోల్చలేం. ఒకవిధంగా చెప్పాలంటే.. ఇళయరాజా వంటి సంగీత దర్శకుడు గతంలో లేరు, ఇకపై రారు కూడా. సినీ సంగీత సామ్రాజ్యంలో ఆయనకు ఆయనే సాటి.
దక్షిణ భారతదేశంలో ఉన్న స్టార్ హీరోలందరికీ సూపర్‌హిట్ సాంగ్స్ అందించిన ఘనత ఇళయరాజాకే దక్కుతుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు రిలీజ్ రోజు అభిమానులు పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఒక సంగీత దర్శకుడికి హీరోతో సమానంగా కటౌట్ పెట్టడం అనేది ఇళయరాజాతోనే మొదలైంది. తమిళ్‌లో రజినీకాంత్ నటించిన ఓ సినిమా రిలీజ్ రోజున అతని కటౌట్ పక్కనే ఇళయరాజా కటౌట్‌ను పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు సంగీత ప్రియులు. ఇక ఇళయరాజా అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆరు నేషనల్ అవార్డులు, 16 ఫిలింఫేర్ అవార్డులు, 6 నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం అందించే అవార్డులతోపాటు కలైమామణి పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇళయరాజా. అలాగే కేరళ స్టేట్ అవార్డులు, ఇంకా జాతీయ అంతర్జాతీయ అవార్డులు అనేకం ఆయన్ని వరించాయి. 50 సంవత్సరాల తన కెరీర్‌లో 1,000 సినిమాల్లో 5,000 పాటలు స్వరపరిచారు. 82 సంవత్సరాల వయసులో ఇప్పటికీ అదే ఉత్సాహంతో అందరికీ వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్నారు.
శాస్త్రీయ సంగీతంలోనే కాదు, వెస్ట్రన్ మ్యూజిక్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఇళయరాజా.. మరే భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని సింఫోని కాన్సర్ట్‌ని అద్భుతంగా నిర్వహించి ప్రపంచ సంగీత కళాకారుల ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమా సంగీతమే కాదు, భారతీయ శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్‌ని మిక్స్ చేస్తూ 1986లో ‘హౌ టు నేమ్ ఇట్’, 1988లో ‘నథింగ్ బట్ విండ్’ అనే ఆల్బమ్స్‌ను రూపొందించి ఆరోజుల్లోనే గొప్ప ప్రయోగం చేశారు. ఈ ఆల్బమ్స్ అప్పట్లో విపరీతంగా సేల్ అయ్యాయి. 40 సంవత్సరాల క్రితమే దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఏకైక భారతీయ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే.. భార్య పేరు జీవా రాజయ్య, కుమారులు యువన్ శంకర్‌రాజా, కార్తీక్‌రాజా, కుమార్తె భవతారిణి. యువన్ శంకర్‌రాజా, కార్తీక్ రాజా సంగీత దర్శకులుగా తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. కుమార్తె భవతారిణి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. గత ఏడాది జనవరిలో 47 ఏళ్ళ వయసులో క్యాన్సర్‌తో కన్నుమూశారు భవతారిణి.
(జూన్ 2 ఇసై జ్ఞాని ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా..)
![]() |
![]() |